Tuesday, May 21, 2019

స్వప్న దర్శనం


శ్రీ గురుభ్యోనమః

22-మే-2019  తెల్లవారుఝామున శ్రీకామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఒక ఉన్నతాసనం మీద కూర్చుని అపరకామాక్షివలె తమ కరుణాపూరిత దృక్కులను ప్రసరింపజేస్తున్నారు. ఆ ప్రదేశంలో స్వామివారు వారికి అంతే వాసులుగా ఉన్న మరొక దంపతులు (ఎవరో గుర్తుతెలియదు), శ్రీధరన్ మామ, నేను నా భార్య ఉన్నాము. స్వామి వారు చిద్విలాసులై అంతరంగీకులైన  ఆ దంపతులతోనూ, మాతోనూ సంభాషిస్తూ ఉన్నారు. ఒక అరగంట పైగా అలా జరిగిన తరవాత నేను నాభార్య కలిసి జగద్గురువులకు ప్రణిపాతం చేయగా స్వామి వారు పక్కన ఉన్న అక్షతల పళ్ళెంలోంచి అక్షతలు తీసి మా ఇద్దరి శిరసున ఉంచి ఆశీర్వదించారు. ఒక గుప్పెడు అక్షతలను తీసి నా చేతిలో ఉంచి ఆశీర్వదించారు. తరవాత శ్రీధరన్ మామ బయలుదేరుతుంటే వారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాం, స్వామి వారి వద్దన మాతోపాటు ఉన్న దంపతుల వద్దకూడా ఆశీస్సులు పొందాం. అనంతరం వారు బయలుదేరారు. శ్రీ స్వామి వారు ఇక లేచి అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళబోతూ ఏదో అడగాలని అనుకుంటున్న నన్ను చూసి ఆగిపోయావేం అడుగు అన్నారు. నోటికి చేయి అడ్డంపెట్టుకుని స్వామి వారి దగ్గరకి వంగి స్వామీ ఏనాటినుంచో తమకు పాదుకలు సమర్పించాలని ఉన్నది, మీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాను. ఓ అదా... ఏదైనా కార్యక్రమంలోనో పండగరోజుల్లోనో సమర్పించు అని చెప్పి నాలోని బెరుకును తేలికగా తొలగించేసారు. నా ఆనందానికి అవధులు లేవు. నేను సమర్పించే పాదుకలు కేవల చెక్కతో చేసిన వస్తువు కాదు. చెక్కరూపంలో మ్రాన్పడిపోయిన నా మనఃప్రతిరూపమైన పాదుకలు అని అనుకుంటుండగా..

వెంటనే మెలుకువ వచ్చింది. దాదాపు అరగంటకుపైగా కలలో స్వామివారితో సంభాషించడం, వారు ఆశీర్వాదం, అనుజ్ఞ తలుచుకుంటూ అల్పుణ్ణి నేనెక్కడ జగద్గురువులు సాక్షాత్ కామాక్షీ స్వరూపులు ఐన స్వామివారెక్కడ అనుకుని, కలలోనైనా ఈ భాగ్యానికి నోచుకున్నానని ఆనందిస్తూ,  లేచి నిత్య కర్మకుద్యుక్తుణ్ణయ్యాను. ఆనక వాట్సప్ లో నడిచేదేవుడైన పరమాచార్య  వారికి సంబంధించి ఒక సందేశం వచ్చింది. ఒకానొక సందర్భంలో సం 1931 ప్రాంతంలో పరమాచార్య వారన్నమాటలేమంటే " నన్ను చూడాలన్న వారిని కలవకుండా నేను తలుపులు మూసుకుంటే, జగద్గురు అన్న బిరుదునామం ఉంచుకోవడానికి, ఈ పీఠ సింహాసనం పైన కూర్చోవడానికి నాకు అర్హత ఉండదు" అని. నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. నా వంటి వాడికోసంకూడా ఆలోచన చేసి జగద్గురువులు కష్టపడి స్వప్న దర్శనం ఇస్తారా.... వారు జగద్గురువులు, అపర కామాక్షీ స్వరూపులు వారు ఏవిధంగానైనా ఉద్ధరించగలరు. ఇది చేయగలరు ఇది చేయలేరు అన్నది నావంటి అల్పబుద్ధుల విషయంలో కలుగుతాయి తప్ప వారి విషయంలో అసమంజసమైన భావన.

జయ జయ శంకర హర హరశంకర
కాంచి శంకర కామకోటి శంకర

-శంకరకింకర
(22-May-2019)


No comments:

Post a Comment