Thursday, April 18, 2019

వసంత నవరాత్రి - యుగాది అనుగ్రహభాషణం



శ్రీ గురుభ్యోనమః

శ్రీ గణేశాయ నమః
జయ జయ శంకర హర హర శంకర

ప్రాజెక్ట్ :- శ్రీ విజయేంద్ర వచనామృతం

భక్తి సదాచారముతో మన జీవితంలో పుణ్యం సంపాదించుకోవాలి. సంసారిక జీవనంలో ప్రజలు సుకార్యములు చేసి పుణ్యం సంపాదించుకోవాలి. పుణ్యసముపార్జనకు వివిధ ఉపాయాలున్నవి. ఒకటి ప్రతిరోజూ నిత్యానుష్ఠానం చేయాలి. సంధ్యావందనం, దీప ప్రజ్వలనం, తిలక ధారణం, గురువులు, సాధు సంతుల సేవనం, భగవన్నామాన్ని నిత్య స్మరించాలి, రామ రామ, శివ-శివ, నారాయణ- నారాయణ ఇలా ఇష్టదేవతా నామం నిత్య స్మరణం చేయాలి. నైమిత్తిక కర్మలు , కుంభమేళ, పర్వదినాలలో గంగాది నదీ స్నానాలు చేయాలి. ప్రతినిత్యమూ ఏది చేయాలో అది చేస్తూండాలి. అలాగే చైత్రం నుండిఫాల్గుణం వరకూ పన్నెండు మాసాలలో ప్రత్యేక పర్వదినాలు వస్తాయి, శ్రీరామనవమి, వసంత పంచమి, గోపాష్టమి, దీపావళి, మాఘస్నానం ఇలా ఎన్నో పర్వదినాలు సంభవస్తాయి. కొన్ని పర్వదినాల్లో స్నానం చేయడం విశేషం, కొన్ని పర్వదినాల్లో ఉపవాసం, పారాయణ చేయడం విశేషం, పరిక్రమ చేయడం గోవర్థన పరిక్రమ చేయడం అలాగే కావళ్ళను ఎత్తుకొనివైద్యనాథ్ ధామ్ దగ్గర గంగోత్రి, యమునోత్రి వంటి చోట్ల కావడులలో తెచ్చి అభిషేకం చేయడం ఒక విధానం. ఇలా ఎన్నో ప్రకారమైన పద్ధతులున్నాయి. అన్నింటి ఉద్దేశ్యమూ ఒక్కటే భక్తి, సదాచారము సభ్యత.

ఇలాంటి పర్వకాలాలలో నవరాత్రి అని ఒక పర్వకాలము. నిజానికి నాలుగు నవరాత్రులు వస్తాయి. వాటిలో రెండు ప్రసిద్ధమైనవి అవి శరన్నవరాత్రులు మరొకటి వసంతనవరాత్రులు. శరన్నవరాత్రులు శరదృతువులో పితృపక్షం తరవాత అంటే పదిహేను రోజుల భాద్రపద కృష్ణపక్షం అమావాస్య అనంతరం ప్రతిపత్తిథి నుండి విజయ దశమి వరకు మూడేసి రోజులు దుర్గా, లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను పూజించి విజయదశమి నాడు విశేష ఉత్సవాలు చేస్తారు దీనిని శరన్నవరాత్రి అంటారు.

పంచాంగం ప్రకారం సంవత్సర ఆరంభంలో చైత్ర మాసంలో ఒక నవరాత్రి వస్తుంది. దానిని వసంత నవరాత్రి అంటారు. రాత్రి రూపా యతో దేవీ, దివా రూపో మహేశ్వరః.. సామాన్యంగా పూజా హోమాదులు పగలు కాలంలోనే చేస్తారు. విశేష అనుమతి ఉన్న రోజులలో రాత్రికూడా ఇటువంటి పూజాహోమాది ఉపాసనలుంటాయి. శివరాత్రికి అలా అనుమతి ఉన్నది. అందుకే శివరాత్రి పగలు మొదలు పెట్టి అహోరాత్రం నిర్వహించుకొని 24గంటలూ ఆచరిస్తాము. అలాగే చైత్ర నవరాత్రి వసంత ఋతువులో వస్తుంది. ఆరు ఋతువులున్నాయి, వసంతాది షడృతుషు... కొందరు పంచఋతువులంటారు హేమంత శిశిరః సమా సేనా అని హేమంత ఋతువు శిశిర ఋతువు రెండింటినీ కలిపి ఒక ఋతువుగా కూడా చెప్తారు. ఈలెక్కన ఐదు ఋతువులున్నాయి సాధారణంగా మనం ఆరు ఋతువులంటారు. రెండేసి నెలలకు ఒకఋతువు అధికమాసం ఉన్నప్పుడు ఒక మాసం పదమూడో మాసం ఎక్కువ వస్తుంది. ఈ వసంత ఋతువు ఈ యుగాది నుండి ప్రారంభమౌతుంది. యుగాది అంటే ఏమిటి?  తిథే శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్థనం. నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగనివారణం. పఞ్చాంగం లో పఞ్చ అంగాలుంటాయి. తిథి, వార నక్షత్ర యోగ కరణ అనే ఐదు భాగాలుంటాయి. ఏదైనా సుకార్యం చేయాలన్నప్పుడు పూజ, హోమం, పారాయణ లేదా ఏమంచి పనైనా సంకల్పంతో మొదలౌతుంది అనుజ్ఞతో మొదలౌతుంది. భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమర్హసి, గణేశుని ప్రార్థించి, గురువుగారిని ప్రార్థించి ఆపైన భైరవుని వద్ద అనుజ్ఞ "పర్మిషన్" అంటాం కదా అది తీస్కొని పని మొదలుపెట్టాలి. ఆ సంకల్పం చెప్పినప్పుడు తిథివారనక్షత్రయోగకరణాలు చెప్పాలి. సామాన్యంగా తిథివారనక్షత్రాలు చెప్పి శుభకరణ శుభయోగ అని చెప్తారు. ఆచారం ప్రకారం మొత్తం చెప్తారు. ఈ ఐదింటి  ఉచ్చారణ చేయవడం వల్ల ఏ పని మొదలుపెట్టామో దాని సాఫలత పరిపూర్ణంగా లభిస్తుంది.

దేశకాలౌ సంకీర్త్య అని చెప్తాం. దేశం అంటే కృష్ణా-గోదావర్యోర్మధ్య ప్రదేశే, అలాగే కావేరీ-గంగామధ్యే ఇలా మనం యేయే ప్రదేశంలో ఉండి ఆ కార్యనిర్వహిస్తున్నామో  సంకల్పంలో ఆయా ప్రదేశాన్ని ఉల్లేఖించాలి. అలాగే కాలాన్ని కీర్తించాలి. అందులో తిథి ఉచ్చారణ చేయడం వల్ల ఉదాహరణ చతుర్థినాడు ఈ కార్యం చేస్తున్నాను అని చెప్పడం వల్ల మనకు  సౌభాగ్యం సంపద లభిస్తాయి. వారాత్ ఆయుష్య వర్థనం. భాను వాసరం ఇది చేస్తున్నాను, బుధవాసరం ఇది చేస్తున్నాను గురువాసరం ఇది చేస్తున్నాను అని సంకల్పంలో చెప్పడం వల్ల మన ఆయుష్షు పెరిగి దీర్ఘాయుష్మంతులమౌతాము. నక్షత్రాత్ హరతే పాపం, ఆర్ద్రా నక్షత్రంలో,  పునర్వసు నక్షత్రంలో, హస్త నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో, శ్రవిష్ఠ నక్షత్రంలో,  ఇలా చెప్పడం వల్ల హరతే పాపం మనలో ఏ దోషాలు ఉన్నాయో జ్ఞానాజ్ఞానతః మనకి ప్రాప్తమైన పాపదోషములు దూరమౌతాయి. యోగాత్ రోగనివారణం శివ యోగం ఇలా యోగములను పలకడం వల్ల రోగములుతొలగి సుఖవంతులై ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, తైతుల కరణ, భధ్ర కరణం ఇలా వీటిని పలకడం వల్ల మనం ఏ మంచి పనులైతే మొదలుపెట్టామో వాటిలో ఆటంకములు రాకుండా పూర్ణ రూపంలో సాఫల్యం సిద్ధిస్తుంది. కరణాత్ కార్య సిద్ధిశ్చ పఞ్చాంగ ఫలముచ్యతే. అందుకే ఆఫిసుకెళ్ళేవాళ్ళు క్యాలెండర్ చూస్తారు. మఠాలకీ, మందిరాలకీ వెళ్ళేవాళ్ళు పఞ్చాంగం చూసి పని చేయాలి.  సుమూహర్తం చూస్కోవాలి.  దేవ లగ్నం. సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ | విద్యాబలం. దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘియుగం స్మరామి
కరిష్యమాణశ్చ కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్యర్థం ఆదౌ విఘ్నేశ్వర పూజాం కరిష్యే అని చెప్తారు.

ఇలా దేశకాలాలను అనుసరించి వసంత ఋతువులో దేవీ పూజ చేయడం మహిమాన్వితం. మనం రోజూ కుంకుమార్చన చేయవచ్చు దాని వలన కూడా పుణ్యం పొందవచ్చు. వసంత ఋతువులో చేసే పూజ, అది కూడా యుగాది సమయంలో పూజ చేయాలి. యుగాది అంటే యుగ + ఆది , మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం క్రొత్త సంవత్సరం మొదలయ్యే రోజు. ఈ రోజు పఞ్చాగం పఠనం, శ్రవణం చేయాలి తరవాత ప్రసాదాన్ని నివేదన చేసి అందరికీ పంచాలి. యుగాది ప్రసాదంలో కొద్దిగా బెల్లం, వేప పువ్వు, మామిడి కాయలు ఇవన్నీ వేసి తయారు చేస్తారు. యుగాది ప్రసాద స్వీకారాన్ని నింబ కందళ భక్షణం అని అంటారు. ఈ యుగాది పచ్చడి ప్రసాదం స్వీకరిస్తే మనకు లాభమేమిటి దాని ప్రత్యేకత ఏమిటి? అంటే "శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం". కొత్త సంవత్సరం ప్రసాదాన్ని అందరూ తయారు చేసి భగవంతునికి నివేదన చేసి భక్తులందరికీ పంచాలి. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శతాయుర్వజ్రదేహాయ వజ్రశరీరం మంచి ధృడమైన శరీరం లభించడం శతాయుష్షుని పొందడం ఈ ప్రసాదం ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. సర్వసంపత్కరాయచ , అంటే కేవలం సంపదయే కాదు మంచి సంతానం, మంచి మిత్రులు, మంచి ఆలోచనలు, మంచి మనసు, ఇవన్నీ లభిస్తాయి. గోసంపద, గుర్రాలు, ఏనుగుల సంపద, అనేక రకాలైన సంపద ధనధాన్య సమృద్ధి మన ఇంట్లో, ప్రపంచంలో అంతటా వృద్ధిచెందుతుంది. సర్వారిష్ఠ వినాశాయ, ఒకవేపు నుండీ మనకు అభివృద్ధి, వికాసం వస్తుంటాయి కానీ మధ్యమధ్యలో ఎప్పుడైనా విఘ్నాలొస్తున్నా అవి తొలగిపోవాలి. అందుకే సురక్షితమైన మార్గంలో మన ప్రగతి ఉండాలి. అందుకే ఇలాంటి అరిష్ఠాలు తొలగడానికి ప్రసాదం తీస్కోవాలి సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం.

ఇలా కొత్త సంవత్సర పుణ్యకాల విశేషం చెప్పారు. భక్తులందరూ ఈ తొమ్మిది రోజుల నవరాత్రి చేయాలి. దేవీ పూజ చేయాలి. కుమారీ పూజలు చేయాలి. పెద్దలైన సువాసినులను పూజించాలి ’సువాసిన్యర్చన ప్రీతా’. వాళ్లకి పువ్వులు, వస్త్రాలు పసుపు కుంకుమలిచ్చి పూజించాలి. మన దేశంలో కన్యకా పూజ (కుమారీ పూజ) విశేషమైనదిగా భావిస్తారు. నేపాళ దేశంలో కూడా ఎంతో పవిత్రంగా గొప్పగా కుమారీ పూజనిర్వహిస్తారు. ఈ నవరాత్రిలో పుణ్యకార్యాలు చేయాలి, దేవీభాగవతం పారాయణ చేయాలి. హిమాచల్ ప్రదేశ్‍లో ఎన్నో అమ్మవారి ఆలయాలున్నాయి కంగ్డామాత, నైనా దేవీ, జ్వాలా ముఖి ఇలా ఎన్నో ఆలయాలున్నాయి. ఇలాంటి తీర్థ క్షేత్రాలు నవరాత్రి సందర్భంలో భక్తులందరూ సందర్శించాలి. ఇంట్లోనూ, గుళ్ళలోనూ కుంకుమ, సింధూరం ఇవ్వాలి. ఇలా అమ్మవారి ప్రీతికరమైన విషయాలను ఆచరిస్తూ నవరాత్రి పూజచేయడం వల్ల "దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖమ్" సాధారణ సుఖం కాదు పరమ సుఖం. రూపందేహి జయందేహి యశోదేహి ద్విషోజహి ఇలా నవరాత్రి పూజవలన మనకు దైవీ సంపద ద్వారా దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. అందువలన అమ్మవారి వలన దైవీ శక్తి పొంది మంచి మంచి కార్యాలను నిర్వహించే ప్రయత్నం చేయాలి.

జయ జయ శంకర - హర హర శంకర

వివరములు:-
05 April 2019
శ్రీ విళంబి ఫాల్గుణ బహుళ అమావాస్య
వసంత నవరాత్రి - యుగాది అనుగ్రహభాషణం
మూలం హిందీ అనుగ్రహభాషణం
https://www.youtube.com/watch?v=JhxHeBpRW-4