Monday, June 3, 2019

విజయేంద్ర వచనామృతం - 00013


విజయేంద్ర వచనామృతం - 00012


విజయేంద్ర వచనామృతం - 00011


విజయేంద్ర వచనామృతం - 00010


విజయేంద్ర వచనామృతం - 00008


విజయేంద్ర వచనామృతం - 00007


విజయేంద్ర వచనామృతం - 00006


Wednesday, May 29, 2019

ఉపకారకమైన జీవితం - విస్తృతమైన ప్రార్థన - Jun 18, 2015


Sri Kanchi Kamakoti Peetam Kanchipuram
Published on Jun 18, 2015
Anugraha Bhashanam in Telugu

మన ధర్మము సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము అతి ప్రాచీనమైన ధర్మము. ఎప్పుడు సృష్టి అనేది ప్రారంభం చేయబడిందో ఆ సమయమునుంచే సృష్టింపబడిన జీవరాశులు మంచి సదాచారముతో ఈశ్వరభక్తితో మంచి ఆలోచనలతో జీవితములో కార్యక్రమాలు చేసి గురుభక్తితో ఈశ్వర భక్తితో నిర్విఘ్నముగా మంచికార్యాన్ని చేసుకోవాలని ఆలోచించి ఈ ధర్మాన్ని, వేదాన్ని మనకందిచినారు. ధర్మోవిశ్వస్య జగతః ప్రతిష్టా.. ఈ ధర్మం చేత మనం చేయవలసిన కార్యక్రమాలు చేయరాని కార్యక్రమాలు అన్నీ తెలుసుకొని, చేయవలసిన కార్యక్రమాలను మంచిగా చేసి. ఏవైతే మనం చేయకూడదో వాటిని దూరంపెట్టి, మన శాస్త్ర సంప్రదాయాలను మంచిగా ఆచరించాలి. రాగద్వేషాలు జీవితంలో సహజసిద్ధంగా కొన్ని ఉన్నా, మంచి విషయంలో రాగాన్ని పెంచుకొని, శ్రద్ధను పెంచుకొని, ఆసక్తిని మనం అభివృద్ధి చేసుకొని మంచి కార్యక్రమాలు చేసుకోవాలి.  మన భారతదేశం లో ఋషులు, మహాత్ములు, మహనీయులు ఇక్కడ తపస్సు చేసి ఈశ్వర భక్తిని చేసి అత్యుత్తమమైన ఒక జీవన విధానాన్ని అందించారు.


పవిత్రమైన జీవిత చర్య
ఉత్తమమైన ఉదారమైన ఆలోచన
ఉపకారకమైన జీవితం - పది మందికి సహాయం చేసే జీవితము,
విస్తృతమైన ప్రార్థన , విశాలమైన ప్రార్థన "లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు ఇదీ మన దేశం యొక్క ప్రార్థన.



ఈ విధంగా లౌకికమైన జీవితంలో కూడా మన ఆహారపద్ధతి, మన అలంకార పద్ధతి, మన ఆచారపద్ధతి అన్నీకూడా ఋషి జీవితాన్ని అనుసరించి సాత్వికమైన పద్ధతిలో ఆడంబరం లేకుండా ఎంత అవసరమో అంత మాత్రమే మనం ఖర్చులుగానీ, లౌకికమైన ఆలోచనలు కానీ పరిమితం చేసుకొని లోక క్షేమానికి కృషిచేయడమనేది మన శాస్త్రం బోధించే  ధర్మము.

వేదాంత విచారాన్ని పూర్తిగా చేయలేకపోయినాకూడా అప్పుడప్పుడూ మనం ధ్యానం చేయడం, ఉపవాసం చేయడం, మౌన వ్రతాన్ని అనుష్ఠించడం ఈ విధంగా ఋషి చర్యని మనసుపెట్టి చేయాలి. ఈ భారత దేశం బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాన్ని ప్రచారానికి తీసుకువచ్చింది. గురు అనుగ్రహంతో విఘ్నేశ్వర దేవాలయంలో మీరందరూకూడా  చమక నమక ప్రశ్నాన్ని అనుసంధానం చేసుకోవడం, సువాసినీ పూజ, కన్యకా పూజ, కన్యకాపూజ అనేది తరతరాలుగా వస్తున్న మంచి విషయము. కన్యాపూజన సుప్రసన్న హృదయాం అని అమ్మవారి గురించి చెప్పబడింది. ఈ కన్యకా పూజ చేస్తే అమ్మవారు మనసు సంతోషించి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుందని చెప్పబడింది. ఈ విధంగా మీరందరూ శాస్త్ర సంప్రదాయాన్ని దూర దేశంలో ఉన్నా సదుద్దేశంతో ఈ విషయాల్ని చేయడం. జుట్టు, బొట్టు, కట్టు అంటాం.. తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఆ విధంగా మన సదాచార సంస్కృతీ సభ్యతల్నీ మంచి నమ్మకంతో పదిమందీ కూడా కలిసి ఇంట్లో కూడా ఆచరించి మంచి పరంపరలో వచ్చినారు గనక, ఆ పరంపరగతమైన ధర్మాన్ని చక్కగా ఆచరించి ఈశ్వర అనుగ్రహం పొందడానికి అందరూ ప్రయత్నం చేయాలి

హర హర నమః పార్వతీ పతయే నమః



Sunday, May 26, 2019

అఖిలం మధురం....



(తమ గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారిని గూర్చి కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామి వారి వ్యాసం)
ఆంధ్ర జ్యోతి , నవ్య, 02-03-2018

మీ లానే... మీ పిల్లలు!
మన భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం దంపతులు ఒకే మాట, ఒకే బాటగా జీవితం సాగించాలి. వాళ్ళను బట్టే, వాళ్ళకు కలిగే పిల్లలూ తయారవుతారు. ఇవాళ్టి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. మనకు అనాది కాలంగా వస్తున్న సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. వాటిని ఈనాటి పిల్లలకు బోధిస్తూ, ధర్మం చెప్పడం ఎంతో అవసరమనేది అందుకే! అది ఎలాంటి ధర్మం అంటే- అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం ఉన్న ధర్మం. ఈ అయిదూ అందరికీ అవసరం. అయితే, వాటిని ముందుగా తల్లితండ్రులు ఆచరించాలి.

తల్లితండ్రుల ప్రవర్తనే పిల్లలకు గురువుగా మార్గదర్శనం చేస్తుంది. అలా పిల్లలకు తమ ప్రవర్తన ద్వారా నేర్పాలి. ఇలా జాతి అంతా ఐకమత్యంగా ధర్మమార్గంలో వెళితే, అప్పుడే దేశ సౌభాగ్యం. జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఇదే మార్గం. ధర్మం విషయంలో ఎప్పుడైనా, ఏదైనా సందేహం కలిగితే, ఉత్తముడైన గురువును ఆశ్రయించాలి. మామూలు మాటల్లో చెప్పాలంటే, పరోపకారమే పరమ ధర్మం. వృద్ధులను సేవించడం, తోటివారిని ప్రేమించడం, ఆపదలో... అవసరంలో... ఉన్నవారిని ఆదుకొనడం... ఇంతకు మించి వేరే ధర్మం ఏముంటుంది! ఇలాంటి *ధర్మాచరణ వల్ల మనుషులు బాగుంటారు. మనుషులు బాగుంటే, జీవితం బాగుంటుంది. చుట్టుపక్కల అందరి జీవితం బాగుంటే, సమాజం బాగుంటుంది. అంటే మన దేశం బాగుంటుంది*.

చిరస్మరణీయం
ప్రతి ఒక్కరికీ, వారి జీవితంలో మేలిమలుపుగా నిలిచిపోయే, బాగా గుర్తుండిపోయే రోజు ఒకటి ఉంటుంది. నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అలాంటి రోజు 1983 మే 29వ తేదీ. ఆ రోజున మా గురుదేవులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీ చేతుల మీదుగా నేను సన్న్యాస దీక్ష తీసుకున్నాను. దివ్యస్వరూపులైన నా గురువు నన్ను అక్కున చేర్చుకొని, పక్షి తన పిల్లను సాకినట్టు నన్ను సాకడం నా భాగ్యం! వెనక్కి తిరిగి చూసుకుంటే మా గురువుగారి సన్నిహిత సాహచర్యంలో నేను గడిపిన సంవత్సరాలు కనిపిస్తున్నాయి.

అయస్కాంతం ఇనుప రజనును లాగినట్టు నన్ను ఆయన తన వైపు ఆకర్షించుకున్నారు. చాలా సన్నిహితంగా ఉంటూ నేను ఆయనలో గమనించిన గొప్ప గుణాల గురించి వ్యక్తపరచడానికి నా దగ్గరున్న మాటలు సరిపోవు. ‘‘‘శ్రీమఠం’ (కంచి కామకోటి పీఠం) కోసం మీ గురువు (జయేంద్ర సరస్వతి) చేసిన సేవలు మరెవరూ చెయ్యలేరు’’ అంటూ పరమాచార్య (శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి) నాతో అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. అవి ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నా గురువు బహుముఖీనమైన వ్యక్తి. శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ వల్లభాచార్య రచించిన శ్లోకం ఒకటుంది.

అధరం మధురం
వదనం మధురం
నయనం మధురం
హసితం మధురం
హృదయం మధురం
గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురం
ఇదే విధంగా మా గురువుగారి ప్రతి లక్షణాన్నీ నేను గణించినట్టయితే, ఆయన సర్వ సద్గుణాల రాశిగా దర్శనమిస్తారు. ఆయనను విశ్వంలో విశిష్ట వ్యక్తిగా చేసిన కొన్ని లక్షణాలను చెప్పాలనుకుంటున్నాను.

శ్రీ ఆది శంకర భగవత్పాదులు రెండువేల అయిదువందల సంవత్సరాల కిందట స్థాపించిన ‘శ్రీ కంచి కామకోటి పీఠం’ అధిపతిగా అత్యున్నతమైన పదవిని నిర్వహిస్తున్నప్పటికీ పూజ్య గురువులు చాలా నిరాడంబరంగా, ఎల్లప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే మోముతో ఉండేవారు. ఎవరైనా ఆయనను చాలా సులభంగా కలుసుకోవచ్చు. తన భక్తుల జీవితాల్లో సమస్యలను ఆయన చాలా ఓపికగా వింటారు. పరిహారాలతో పరిష్కారాలు సూచిస్తారు. వారిని ఆశీర్వదిస్తారు. తనకు అసౌకర్యం కలిగినా లెక్క చెయ్యకుండా దర్శనం వారికి ప్రసాదిస్తారు. తన దగ్గరకు వచ్చినవారెవరినీ ఆశాభంగంతో తిరిగి వెళ్ళనివ్వరు. భగవంతుడికి అనేక నామాల్లో అచ్యుతుడనేది ఒకటి, ‘తన దగ్గరకు చేరిన వారిని తన చేతుల నుంచి విడవని వాడు’ అని దాని అర్థం. సరిగ్గా మా గురుదేవులు అలాంటివారే!

మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌కు పాఠం
మా పూజ్య గురువులు నడిచే విజ్ఞాన సర్వస్వం. సూర్యుడి వెలుగు పడేవాటిలో ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు. మంచి విషయాలను ఆయన గౌరవించేవారు. అవి ఎక్కడున్నా వాటిని గుర్తించేవారు, అభినందించేవారు. ఆయన నైపుణ్య నిర్వహణ (స్కిల్‌ మేనేజ్‌మెంట్‌) మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విద్యార్థులకు ఒక పాఠ్య పుస్తకం లాంటిది. ఆయన కచ్చితమైన ప్రణాళిక, దేనినైనా జాగ్రత్తగా అమలు చేయడం లాంటివి అనుసరించాల్సిన పాఠాలు. అలాగే సాగతీతలేవీ లేకుండా, ఆయన త్వరగా నిర్ణయాలు తీసుకొనేవారు. ఉదాసీనత, ఉపేక్ష అనేవి ఆయన నిఘంటువులో లేని పదాలు. సరైన ఫలితాల కోసం సరైన పనిని సరైన వ్యక్తికే ఎప్పుడూ ఆయన అప్పగించేవారు. గురువు గారి కరుణకు ఎల్లలు లేవు.

ఆది శంకరుల అడుగుజాడల్లో...
వేదో నిత్యం అధీయతామ్‌!’ - వేదాలను ప్రతిరోజూ అధ్యయనం చేయాలని ఆదిశంకరులు చెప్పారు. వేదాలపైనా, వేద విద్యార్థులపైనా మా గురువుగారి అనురాగం మాటలకు అందనిది. అధ్యయనం గురించీ, చదువుల్లో వారు నిమగ్నం కావడానికి ప్రోత్సాహకంగా సమకూర్చే సౌకర్యాలూ, ఇతర అవసరాల గురించీ విద్యార్థులను ఆయన వాకబు చేసేవారు. వేద పండితులను సత్కరించేవారు. వేద భాష్యం అధ్యయనం చేయా లని వారిని ప్రోత్సహించేవారు. ఆది శంకరుల అడుగు జాడలను పూజ్య గురువులు మనసా వాచా కర్మణా అనుసరించారు. ఆది శంకరులు తన కాలంలోని అన్ని శక్తులనూ ఏకం చేశారు. మా గురుదేవులు వివిధ వర్గాల ఐక్యతకు కేంద్రశక్తిగా నిలిచారు. దేశంలో భిన్నత్వంలోని ఏకత్వాన్ని స్థిరంగా నిలపడానికి కృషి చేశారు. ఆది శంకరుల తరువాత కైలాస పర్వతం దగ్గరకు పీఠం నుంచి వెళ్ళింది మా గురువుగారే! ఆ పర్వత పాదాల దగ్గర ఆది శంకరుల విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. 51 శక్తి పీఠాలు, ఏడు మోక్ష పురాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు... ఇలా దేశంలోని పుణ్య స్థలాలన్నిటినీ ఆయన దర్శించారు. ఏడు పవిత్ర నదులతో సహా పుణ్య నదులన్నిటిలో స్నానం చేశారు.

ఆయన అంచనా అద్భుతం!
ఆయన గురుభక్తి సుప్రసిద్ధం. తన గురువు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామీజీ ఏది కోరినా, దాన్ని తప్పనిసరిగా నెరవేర్చారు. మా గురుదేవులు రచించిన వేదాంత గ్రంథం ‘గురుప్రియ’ అత్యుత్తమమైనది. పరిస్థితులను మదింపు చేయడంలో, ఒక వ్యక్తిని అంచనా వేయడంలో, రాబోయే వాటిని గ్రహించడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. ఆయన అనుసరించదగిన ఆదర్శప్రాయులు. ఇతర మతాల గురువులు ఆయన పట్ల చూపించే గౌరవం, మన్నన ఆయన గొప్పతనానికి రుజువు. ఆయన దృక్పథం ఏ ఒక్క ప్రాంతానికో సంకుచితం కాలేదు. అది ప్రపంచానికీ, ప్రత్యేకించి ఈ దేశానికీ సంబంధించినది. గురుదేవుల ఆలోచన, కార్యక్రమాలూ ఎల్లప్పుడూ దేశ సమగ్రత కోసం ఉద్దేశించినవే.

అదే నాకు భిక్షా వందనం!
కంచి పీఠం పెద్ద స్వామీజీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇప్పటికి 64 ఏళ్ల క్రితం తన ఉత్తరాధికారిగా జయేంద్ర సరస్వతిని ఎంపిక చేశారు. అప్పటికి జయేంద్ర సరస్వతి (పూర్వాశ్రమ నామం సుబ్రమణియం మహదేవ అయ్యర్‌) వయసు 19 ఏళ్ళే! అది జరిగింది 1954లో! ఆ ఏడాది మార్చి 22వ తేదీన పెద్ద స్వామి తన శిష్యుడికి సన్న్యాస దీక్ష నిచ్చి, కంచి కామకోటి పీఠానికి తన ఉత్తరాధికారిగా, చిన్న స్వామీజీగా పీఠారోహణ జరిపించారు. కాంచీపురంలోని సర్వతీర్థ కుళం (ఆలయ కోనేరు) ఒడ్డున విశ్వేశ్వర ఆలయంలో ఉత్సవం చేశారు. సరిగ్గా ఆ ఉత్సవం జరిగి, 54 పూర్తి అవుతున్న సందర్భంగా 2003లో భక్తులందరూ కలసి ‘పీఠారోహణ స్వర్ణజయంతి మహోత్సవం’ ప్రారంభించారు. అయితే, వారందరూ బలవంతాన జయేంద్ర సరస్వతీ స్వామిని ఆ ఉత్సవానికి అంగీకరింపజేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు... ‘‘నేను 50 ఏళ్ళుగా ఉన్నాను అనేది పెద్ద విషయం కాదు. ప్రజల కోసం ఏం చేశామన్నదే ముఖ్యం.’’ జనం కోసం ఏదైనా చేయాలనే ఆయన తపన అలాంటిది. అలాగే, పీఠారోహణ జరిపి 60 ఏళ్ళయిన సందర్భంగా 2014లో భక్తులు వజ్ర మహోత్సవం జరపాలని అనుకున్నారు. అప్పుడు కూడా జయేంద్ర సరస్వతీ స్వామి ఒకటే షరతు పెట్టారు. *బీదసాదల ఆకలి తీర్చాలి. అవసరంలో ఉన్నవారి బాగోగులు చూడాలి. నిరక్షరాస్యులకు విద్యను అందించాలి. ఎవరికి వారు రోజూ తమ జీవనానికి కావాల్సిన సంపాదన ఆర్జించేలా, వారిని స్వశక్తులను చేయాలి. గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడాలి. మీ కృషి, ప్రయత్నాల ద్వారా అలా వారు తినే ప్రతి అన్నం ముద్దా మీరు నాకు సమర్పించే భిక్షా వందనం*

గణపతి అంశ
మరో సందర్భంలో కొందరు తాము ప్రారంభించే నూతన కార్యక్రమానికి ఆశీస్సుల కోసం మహా స్వామి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన, ‘పుదు పెరియవాళ్‌’ వద్దకు వెళ్ళి, ఆశీస్సులు తీసుకోండని చెప్పారు. జయేంద్ర సరస్వతీ స్వామి... సాక్షాత్తూ గణపతి అంశ. అందుకని మీరు కనీసం ఓ రూపాయి అయినా ఆయనకు అందించి, ఆయన చేతుల మీదుగా ఆ రూపాయి తీసుకొని, ఆశీస్సులు పొందండి. అందువల్ల మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయిు అని మహా స్వామి చెప్పారు.

దశావధాని
కంచి మహా స్వామీజీ తన శిష్యులైన జయేంద్ర సరస్వతీ స్వామి శక్తిసామర్థ్యాలను వివిధ సందర్భాల్లో మెచ్చుకున్నారు. ఓ సందర్భంలో ఓ భక్తుడితో మాట్లాడుతూ, ‘‘నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వస్తే, నీతో మాటలు ఆపేసి, వాళ్ళతో మాట్లాడడం మొదలుపెడతా. అలా చాలాసేపు మాట్లాడుతుండే సరికి, దర్శనం కోసం నిరీక్షించే భక్తుల క్యూ పెరిగిపోతుంది. కానీ, ‘పుదు పెరియవాళ్‌’ (కొత్త పెద్ద స్వామిజీ... అంటే జయేంద్ర సరస్వతి) మాత్రం ఏకకాలంలో పది వేర్వేరు పనులు చేయగల ‘దశావధాని’. ఆయన ఒక పక్కన భక్తులకు ప్రసాదం ఇస్తూనే, మరోపక్క కొందరు భక్తులు వేసే ప్రశ్నలకు సమాధానం చెబుతారు. నేను అలా చేయలేకపోతున్నా’’ అన్నారు. అలా మహా స్వామి తన శిష్యుడి సామర్థ్యాలను మెచ్చుకున్నారు.

గురుప్రియులు
గురుభక్తికి ఉత్తమ నిదర్శనంగా నిలుస్తారు... బుధవారం నాడు సిద్ధి పొందిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిజీ. గురువు గారైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామీజీ (కంచి మహా స్వామి) పట్ల ఆయనకున్న భక్తి అంతా ఇంతా కాదు. పెద్ద స్వామీజీ ఎప్పుడూ... తాను ‘ఇచ్ఛాశక్తి’ అయితే, తన శిష్యుడైన జయేంద్ర సరస్వతీ స్వామీజీ ‘క్రియాశక్తి’ అని పేర్కొనేవారు. అచంచల శ్రద్ధాభక్తులున్న శిష్యుడిగా గురువు గారి ప్రతి ఇచ్ఛనూ జయేంద్ర సరస్వతీ స్వామి నెరవేర్చారు. అందుకే, పెద్ద స్వామీజీ అలా ప్రస్తావించేవారు. పీఠాధిపతి అయిన తరువాత జయేంద్ర సరస్వతి తమ గురువు గారి కోరిక మేరకు బ్రహ్మసూత్ర భాష్యంపై ఒక గ్రంథం రాశారు. దానికి ‘గురుప్రియ’ అని పేరు పెట్టారు. బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యంలోని సత్యాలను వివరిస్తూ సాగిన ఆ వ్యాఖ్య అత్యద్భుతమైనదని మహా పండితులు సైతం ప్రశంసించారు. ఎంతో స్పష్టంగా, క్లుప్తంగా, సముచితంగా సాగే గ్రంథం అది. మననం (ధ్యానం)లో గడిపే విద్యార్థులకు ఆ గ్రంథం ఒక మంచి పునశ్చరణగా ఉపకరించే రచన.

ఆ ఘనత ఆయనదే!
మన సంప్రదాయం, సంస్కృతి పట్ల ఆయన విశ్వాసం లోతైనది. మన సంస్కృతిని ప్రచారం చెయ్యడానికి అధునాతన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించేవారు. ఇది ఆయనను పాతకూ, కొత్తకూ మధ్య ఒక గొప్ప వారధిగా నిలబెట్టింది. ప్రధానంగా చెప్పుకోవలసింది- సామాజిక పునరేకీకరణ పట్ల ఆయన దృక్పథం. గతంలో హిందూయిజం వ్యక్తి ఆధారితంగా ఉండేది. పునర్జన్మ లేని ఒక స్థితిని అందుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా వ్యక్తి ఎదగాలని చెప్పేది. ‘జనకల్యాణ్‌-జనజాగరణ్‌’ ఉద్యమం ద్వారా జన సముద్ధరణ కోసం సమాజం గుమ్మం దగ్గరకు హిందూ మతాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ‘మానవసేవే మాధవ సేవ’ అని హృదయపూర్వకంగా నమ్మి, అన్ని వర్గాలకూ, సమాజానికీ సేవలు అందించడం ముఖ్యమని ప్రజలు గ్రహించేట్టు చేయాలని ఆయన ప్రయత్నించారు. ఇది ఆయన సేవల్లో శిఖరాయమానం!
-శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి
(కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి)

Tuesday, May 21, 2019

స్వప్న దర్శనం


శ్రీ గురుభ్యోనమః

22-మే-2019  తెల్లవారుఝామున శ్రీకామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఒక ఉన్నతాసనం మీద కూర్చుని అపరకామాక్షివలె తమ కరుణాపూరిత దృక్కులను ప్రసరింపజేస్తున్నారు. ఆ ప్రదేశంలో స్వామివారు వారికి అంతే వాసులుగా ఉన్న మరొక దంపతులు (ఎవరో గుర్తుతెలియదు), శ్రీధరన్ మామ, నేను నా భార్య ఉన్నాము. స్వామి వారు చిద్విలాసులై అంతరంగీకులైన  ఆ దంపతులతోనూ, మాతోనూ సంభాషిస్తూ ఉన్నారు. ఒక అరగంట పైగా అలా జరిగిన తరవాత నేను నాభార్య కలిసి జగద్గురువులకు ప్రణిపాతం చేయగా స్వామి వారు పక్కన ఉన్న అక్షతల పళ్ళెంలోంచి అక్షతలు తీసి మా ఇద్దరి శిరసున ఉంచి ఆశీర్వదించారు. ఒక గుప్పెడు అక్షతలను తీసి నా చేతిలో ఉంచి ఆశీర్వదించారు. తరవాత శ్రీధరన్ మామ బయలుదేరుతుంటే వారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాం, స్వామి వారి వద్దన మాతోపాటు ఉన్న దంపతుల వద్దకూడా ఆశీస్సులు పొందాం. అనంతరం వారు బయలుదేరారు. శ్రీ స్వామి వారు ఇక లేచి అటూ ఇటూ నాలుగు అడుగులు వేసి లోపలికి వెళ్ళబోతూ ఏదో అడగాలని అనుకుంటున్న నన్ను చూసి ఆగిపోయావేం అడుగు అన్నారు. నోటికి చేయి అడ్డంపెట్టుకుని స్వామి వారి దగ్గరకి వంగి స్వామీ ఏనాటినుంచో తమకు పాదుకలు సమర్పించాలని ఉన్నది, మీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాను. ఓ అదా... ఏదైనా కార్యక్రమంలోనో పండగరోజుల్లోనో సమర్పించు అని చెప్పి నాలోని బెరుకును తేలికగా తొలగించేసారు. నా ఆనందానికి అవధులు లేవు. నేను సమర్పించే పాదుకలు కేవల చెక్కతో చేసిన వస్తువు కాదు. చెక్కరూపంలో మ్రాన్పడిపోయిన నా మనఃప్రతిరూపమైన పాదుకలు అని అనుకుంటుండగా..

వెంటనే మెలుకువ వచ్చింది. దాదాపు అరగంటకుపైగా కలలో స్వామివారితో సంభాషించడం, వారు ఆశీర్వాదం, అనుజ్ఞ తలుచుకుంటూ అల్పుణ్ణి నేనెక్కడ జగద్గురువులు సాక్షాత్ కామాక్షీ స్వరూపులు ఐన స్వామివారెక్కడ అనుకుని, కలలోనైనా ఈ భాగ్యానికి నోచుకున్నానని ఆనందిస్తూ,  లేచి నిత్య కర్మకుద్యుక్తుణ్ణయ్యాను. ఆనక వాట్సప్ లో నడిచేదేవుడైన పరమాచార్య  వారికి సంబంధించి ఒక సందేశం వచ్చింది. ఒకానొక సందర్భంలో సం 1931 ప్రాంతంలో పరమాచార్య వారన్నమాటలేమంటే " నన్ను చూడాలన్న వారిని కలవకుండా నేను తలుపులు మూసుకుంటే, జగద్గురు అన్న బిరుదునామం ఉంచుకోవడానికి, ఈ పీఠ సింహాసనం పైన కూర్చోవడానికి నాకు అర్హత ఉండదు" అని. నా ఆశ్చర్యానికి అవధుల్లేవు. నా వంటి వాడికోసంకూడా ఆలోచన చేసి జగద్గురువులు కష్టపడి స్వప్న దర్శనం ఇస్తారా.... వారు జగద్గురువులు, అపర కామాక్షీ స్వరూపులు వారు ఏవిధంగానైనా ఉద్ధరించగలరు. ఇది చేయగలరు ఇది చేయలేరు అన్నది నావంటి అల్పబుద్ధుల విషయంలో కలుగుతాయి తప్ప వారి విషయంలో అసమంజసమైన భావన.

జయ జయ శంకర హర హరశంకర
కాంచి శంకర కామకోటి శంకర

-శంకరకింకర
(22-May-2019)


Thursday, April 18, 2019

వసంత నవరాత్రి - యుగాది అనుగ్రహభాషణం



శ్రీ గురుభ్యోనమః

శ్రీ గణేశాయ నమః
జయ జయ శంకర హర హర శంకర

ప్రాజెక్ట్ :- శ్రీ విజయేంద్ర వచనామృతం

భక్తి సదాచారముతో మన జీవితంలో పుణ్యం సంపాదించుకోవాలి. సంసారిక జీవనంలో ప్రజలు సుకార్యములు చేసి పుణ్యం సంపాదించుకోవాలి. పుణ్యసముపార్జనకు వివిధ ఉపాయాలున్నవి. ఒకటి ప్రతిరోజూ నిత్యానుష్ఠానం చేయాలి. సంధ్యావందనం, దీప ప్రజ్వలనం, తిలక ధారణం, గురువులు, సాధు సంతుల సేవనం, భగవన్నామాన్ని నిత్య స్మరించాలి, రామ రామ, శివ-శివ, నారాయణ- నారాయణ ఇలా ఇష్టదేవతా నామం నిత్య స్మరణం చేయాలి. నైమిత్తిక కర్మలు , కుంభమేళ, పర్వదినాలలో గంగాది నదీ స్నానాలు చేయాలి. ప్రతినిత్యమూ ఏది చేయాలో అది చేస్తూండాలి. అలాగే చైత్రం నుండిఫాల్గుణం వరకూ పన్నెండు మాసాలలో ప్రత్యేక పర్వదినాలు వస్తాయి, శ్రీరామనవమి, వసంత పంచమి, గోపాష్టమి, దీపావళి, మాఘస్నానం ఇలా ఎన్నో పర్వదినాలు సంభవస్తాయి. కొన్ని పర్వదినాల్లో స్నానం చేయడం విశేషం, కొన్ని పర్వదినాల్లో ఉపవాసం, పారాయణ చేయడం విశేషం, పరిక్రమ చేయడం గోవర్థన పరిక్రమ చేయడం అలాగే కావళ్ళను ఎత్తుకొనివైద్యనాథ్ ధామ్ దగ్గర గంగోత్రి, యమునోత్రి వంటి చోట్ల కావడులలో తెచ్చి అభిషేకం చేయడం ఒక విధానం. ఇలా ఎన్నో ప్రకారమైన పద్ధతులున్నాయి. అన్నింటి ఉద్దేశ్యమూ ఒక్కటే భక్తి, సదాచారము సభ్యత.

ఇలాంటి పర్వకాలాలలో నవరాత్రి అని ఒక పర్వకాలము. నిజానికి నాలుగు నవరాత్రులు వస్తాయి. వాటిలో రెండు ప్రసిద్ధమైనవి అవి శరన్నవరాత్రులు మరొకటి వసంతనవరాత్రులు. శరన్నవరాత్రులు శరదృతువులో పితృపక్షం తరవాత అంటే పదిహేను రోజుల భాద్రపద కృష్ణపక్షం అమావాస్య అనంతరం ప్రతిపత్తిథి నుండి విజయ దశమి వరకు మూడేసి రోజులు దుర్గా, లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను పూజించి విజయదశమి నాడు విశేష ఉత్సవాలు చేస్తారు దీనిని శరన్నవరాత్రి అంటారు.

పంచాంగం ప్రకారం సంవత్సర ఆరంభంలో చైత్ర మాసంలో ఒక నవరాత్రి వస్తుంది. దానిని వసంత నవరాత్రి అంటారు. రాత్రి రూపా యతో దేవీ, దివా రూపో మహేశ్వరః.. సామాన్యంగా పూజా హోమాదులు పగలు కాలంలోనే చేస్తారు. విశేష అనుమతి ఉన్న రోజులలో రాత్రికూడా ఇటువంటి పూజాహోమాది ఉపాసనలుంటాయి. శివరాత్రికి అలా అనుమతి ఉన్నది. అందుకే శివరాత్రి పగలు మొదలు పెట్టి అహోరాత్రం నిర్వహించుకొని 24గంటలూ ఆచరిస్తాము. అలాగే చైత్ర నవరాత్రి వసంత ఋతువులో వస్తుంది. ఆరు ఋతువులున్నాయి, వసంతాది షడృతుషు... కొందరు పంచఋతువులంటారు హేమంత శిశిరః సమా సేనా అని హేమంత ఋతువు శిశిర ఋతువు రెండింటినీ కలిపి ఒక ఋతువుగా కూడా చెప్తారు. ఈలెక్కన ఐదు ఋతువులున్నాయి సాధారణంగా మనం ఆరు ఋతువులంటారు. రెండేసి నెలలకు ఒకఋతువు అధికమాసం ఉన్నప్పుడు ఒక మాసం పదమూడో మాసం ఎక్కువ వస్తుంది. ఈ వసంత ఋతువు ఈ యుగాది నుండి ప్రారంభమౌతుంది. యుగాది అంటే ఏమిటి?  తిథే శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్థనం. నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగనివారణం. పఞ్చాంగం లో పఞ్చ అంగాలుంటాయి. తిథి, వార నక్షత్ర యోగ కరణ అనే ఐదు భాగాలుంటాయి. ఏదైనా సుకార్యం చేయాలన్నప్పుడు పూజ, హోమం, పారాయణ లేదా ఏమంచి పనైనా సంకల్పంతో మొదలౌతుంది అనుజ్ఞతో మొదలౌతుంది. భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమర్హసి, గణేశుని ప్రార్థించి, గురువుగారిని ప్రార్థించి ఆపైన భైరవుని వద్ద అనుజ్ఞ "పర్మిషన్" అంటాం కదా అది తీస్కొని పని మొదలుపెట్టాలి. ఆ సంకల్పం చెప్పినప్పుడు తిథివారనక్షత్రయోగకరణాలు చెప్పాలి. సామాన్యంగా తిథివారనక్షత్రాలు చెప్పి శుభకరణ శుభయోగ అని చెప్తారు. ఆచారం ప్రకారం మొత్తం చెప్తారు. ఈ ఐదింటి  ఉచ్చారణ చేయవడం వల్ల ఏ పని మొదలుపెట్టామో దాని సాఫలత పరిపూర్ణంగా లభిస్తుంది.

దేశకాలౌ సంకీర్త్య అని చెప్తాం. దేశం అంటే కృష్ణా-గోదావర్యోర్మధ్య ప్రదేశే, అలాగే కావేరీ-గంగామధ్యే ఇలా మనం యేయే ప్రదేశంలో ఉండి ఆ కార్యనిర్వహిస్తున్నామో  సంకల్పంలో ఆయా ప్రదేశాన్ని ఉల్లేఖించాలి. అలాగే కాలాన్ని కీర్తించాలి. అందులో తిథి ఉచ్చారణ చేయడం వల్ల ఉదాహరణ చతుర్థినాడు ఈ కార్యం చేస్తున్నాను అని చెప్పడం వల్ల మనకు  సౌభాగ్యం సంపద లభిస్తాయి. వారాత్ ఆయుష్య వర్థనం. భాను వాసరం ఇది చేస్తున్నాను, బుధవాసరం ఇది చేస్తున్నాను గురువాసరం ఇది చేస్తున్నాను అని సంకల్పంలో చెప్పడం వల్ల మన ఆయుష్షు పెరిగి దీర్ఘాయుష్మంతులమౌతాము. నక్షత్రాత్ హరతే పాపం, ఆర్ద్రా నక్షత్రంలో,  పునర్వసు నక్షత్రంలో, హస్త నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో, శ్రవిష్ఠ నక్షత్రంలో,  ఇలా చెప్పడం వల్ల హరతే పాపం మనలో ఏ దోషాలు ఉన్నాయో జ్ఞానాజ్ఞానతః మనకి ప్రాప్తమైన పాపదోషములు దూరమౌతాయి. యోగాత్ రోగనివారణం శివ యోగం ఇలా యోగములను పలకడం వల్ల రోగములుతొలగి సుఖవంతులై ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, తైతుల కరణ, భధ్ర కరణం ఇలా వీటిని పలకడం వల్ల మనం ఏ మంచి పనులైతే మొదలుపెట్టామో వాటిలో ఆటంకములు రాకుండా పూర్ణ రూపంలో సాఫల్యం సిద్ధిస్తుంది. కరణాత్ కార్య సిద్ధిశ్చ పఞ్చాంగ ఫలముచ్యతే. అందుకే ఆఫిసుకెళ్ళేవాళ్ళు క్యాలెండర్ చూస్తారు. మఠాలకీ, మందిరాలకీ వెళ్ళేవాళ్ళు పఞ్చాంగం చూసి పని చేయాలి.  సుమూహర్తం చూస్కోవాలి.  దేవ లగ్నం. సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ | విద్యాబలం. దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘియుగం స్మరామి
కరిష్యమాణశ్చ కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్యర్థం ఆదౌ విఘ్నేశ్వర పూజాం కరిష్యే అని చెప్తారు.

ఇలా దేశకాలాలను అనుసరించి వసంత ఋతువులో దేవీ పూజ చేయడం మహిమాన్వితం. మనం రోజూ కుంకుమార్చన చేయవచ్చు దాని వలన కూడా పుణ్యం పొందవచ్చు. వసంత ఋతువులో చేసే పూజ, అది కూడా యుగాది సమయంలో పూజ చేయాలి. యుగాది అంటే యుగ + ఆది , మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం క్రొత్త సంవత్సరం మొదలయ్యే రోజు. ఈ రోజు పఞ్చాగం పఠనం, శ్రవణం చేయాలి తరవాత ప్రసాదాన్ని నివేదన చేసి అందరికీ పంచాలి. యుగాది ప్రసాదంలో కొద్దిగా బెల్లం, వేప పువ్వు, మామిడి కాయలు ఇవన్నీ వేసి తయారు చేస్తారు. యుగాది ప్రసాద స్వీకారాన్ని నింబ కందళ భక్షణం అని అంటారు. ఈ యుగాది పచ్చడి ప్రసాదం స్వీకరిస్తే మనకు లాభమేమిటి దాని ప్రత్యేకత ఏమిటి? అంటే "శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం". కొత్త సంవత్సరం ప్రసాదాన్ని అందరూ తయారు చేసి భగవంతునికి నివేదన చేసి భక్తులందరికీ పంచాలి. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శతాయుర్వజ్రదేహాయ వజ్రశరీరం మంచి ధృడమైన శరీరం లభించడం శతాయుష్షుని పొందడం ఈ ప్రసాదం ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. సర్వసంపత్కరాయచ , అంటే కేవలం సంపదయే కాదు మంచి సంతానం, మంచి మిత్రులు, మంచి ఆలోచనలు, మంచి మనసు, ఇవన్నీ లభిస్తాయి. గోసంపద, గుర్రాలు, ఏనుగుల సంపద, అనేక రకాలైన సంపద ధనధాన్య సమృద్ధి మన ఇంట్లో, ప్రపంచంలో అంతటా వృద్ధిచెందుతుంది. సర్వారిష్ఠ వినాశాయ, ఒకవేపు నుండీ మనకు అభివృద్ధి, వికాసం వస్తుంటాయి కానీ మధ్యమధ్యలో ఎప్పుడైనా విఘ్నాలొస్తున్నా అవి తొలగిపోవాలి. అందుకే సురక్షితమైన మార్గంలో మన ప్రగతి ఉండాలి. అందుకే ఇలాంటి అరిష్ఠాలు తొలగడానికి ప్రసాదం తీస్కోవాలి సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం.

ఇలా కొత్త సంవత్సర పుణ్యకాల విశేషం చెప్పారు. భక్తులందరూ ఈ తొమ్మిది రోజుల నవరాత్రి చేయాలి. దేవీ పూజ చేయాలి. కుమారీ పూజలు చేయాలి. పెద్దలైన సువాసినులను పూజించాలి ’సువాసిన్యర్చన ప్రీతా’. వాళ్లకి పువ్వులు, వస్త్రాలు పసుపు కుంకుమలిచ్చి పూజించాలి. మన దేశంలో కన్యకా పూజ (కుమారీ పూజ) విశేషమైనదిగా భావిస్తారు. నేపాళ దేశంలో కూడా ఎంతో పవిత్రంగా గొప్పగా కుమారీ పూజనిర్వహిస్తారు. ఈ నవరాత్రిలో పుణ్యకార్యాలు చేయాలి, దేవీభాగవతం పారాయణ చేయాలి. హిమాచల్ ప్రదేశ్‍లో ఎన్నో అమ్మవారి ఆలయాలున్నాయి కంగ్డామాత, నైనా దేవీ, జ్వాలా ముఖి ఇలా ఎన్నో ఆలయాలున్నాయి. ఇలాంటి తీర్థ క్షేత్రాలు నవరాత్రి సందర్భంలో భక్తులందరూ సందర్శించాలి. ఇంట్లోనూ, గుళ్ళలోనూ కుంకుమ, సింధూరం ఇవ్వాలి. ఇలా అమ్మవారి ప్రీతికరమైన విషయాలను ఆచరిస్తూ నవరాత్రి పూజచేయడం వల్ల "దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖమ్" సాధారణ సుఖం కాదు పరమ సుఖం. రూపందేహి జయందేహి యశోదేహి ద్విషోజహి ఇలా నవరాత్రి పూజవలన మనకు దైవీ సంపద ద్వారా దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. అందువలన అమ్మవారి వలన దైవీ శక్తి పొంది మంచి మంచి కార్యాలను నిర్వహించే ప్రయత్నం చేయాలి.

జయ జయ శంకర - హర హర శంకర

వివరములు:-
05 April 2019
శ్రీ విళంబి ఫాల్గుణ బహుళ అమావాస్య
వసంత నవరాత్రి - యుగాది అనుగ్రహభాషణం
మూలం హిందీ అనుగ్రహభాషణం
https://www.youtube.com/watch?v=JhxHeBpRW-4